లలిత్ మోదీతో సుస్మితాసేన్ డేటింగ్‌పై సంతోషం వ్యక్తం చేసిన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్

ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీతో తమ బంధాన్ని బహిర్గతం చేసినప్పటి నుంచి బాలీవుడ్ నటి సుస్మితా సేన్-లలిత్ మోదీలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. లలిత్ మోదీతో డేటింగ్‌లో ఉన్న విషయాన్ని సుస్మిత వెల్లడిస్తూ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అయింది. తాను సంతోషకరమైన ప్రదేశంలో ఉన్నానని, వివాహం చేసుకోలేదని, ఉంగరాలు మార్చుకోలేదని, షరతులు లేని ప్రేమ తనను చుట్టుముట్టేసిందని పేర్కొంది. సుస్మిత ఈ పోస్ట్ చేసిన వెంటనే బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

లలిత్ మోదీతో సుస్మిత డేటింగ్‌పై ఆమె మాజీ ప్రియుడు, మోడల్ రోహ్మాన్ షాల్ స్పందించాడు. ‘పింక్‌విల్లా’తో మాట్లాడుతూ.. వారి కోసం సంతోషంగా ఉందామని పేర్కొన్నాడు. ప్రేమ చాలా అందంగా ఉంటుందని పేర్కొన్న రోహ్మాన్.. సుస్మిత ఎవరినైనా ఎంచుకుందీ అంటే అతడు చాలా విలువైన వాడు అయి ఉంటాడని పేర్కొన్నాడు.

సుస్మితతో తన బంధంపై లలిత్ మోదీ కూడా అధికారికంగా ప్రకటించాడు. ప్రపంచాన్ని చుట్టేసిన తర్వాత ఇప్పుడే లండన్ చేరుకున్నామని, కుటుంబాలతో కలిసి మాల్దీవులు, సార్డినా వెళ్లామని పేర్కొన్నాడు. తన భాగస్వామి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఎట్టకేలకు కొత్త జీవితం ప్రారంభమైందని పేర్కొన్నాడు. ప్రేమలో ఉన్నామని, ఇంకా పెళ్లి చేసుకోలేదని వివరించాడు. దేవుడి దయతో ఏదో ఒకరోజు అది కూడా అవుతుందని, ఇప్పుడు తామిద్దరం కలిసి ఉన్నామని చెబుతున్నానని ఆ పోస్టులో లలిత్ మోదీ పేర్కొన్నాడు.

ఇక, సుస్మితాసేన్, రోహ్మాన్ షాల్ 2018 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. గతేడాది వారు తమ బ్రేకప్‌ను ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించారు. స్నేహితులుగా తమ ప్రయాణం ప్రారంభమైందని, ఇకపైనా అలాగే ఉంటామని సుస్మిత పేర్కొంది. రిలేషన్‌షిప్ ముగిసి చాలాకాలమైందని, ప్రేమ మాత్రం ఉంటుందని తెలిపింది.
Sushmita Sen, Rohman Shawl, Bollywood, Lalit Modi

Leave A Reply

Your email address will not be published.